ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు

0
155
Ap-politics

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని వెల్లడించాయి. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడయ్యాయి. లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా కట్టాయి. తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార రాదు అని తేల్చాయి. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. మంగళగిరిలో వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య గట్టిపోటీ నెలకొందని చెప్పారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ స్వల్ప మెజార్టీతో గట్టెక్కే అవకాశం ఉందని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేసిన రెండు స్థానాల్లో ఓ స్థానంలో ఓటమి తప్పదని, మరో స్థానంలో గట్టిపోటీ నెలకొందన్నారు. జనసేన నుంచి ఎంపీగా పోటీచేసిన రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ ఓడిపోయే పరిస్థితి ఉందన్నారు. కాగా, వైసీపీ 125-134 అసెంబ్లీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సంస్థ ప్రతినిధి వేణుగోపాల్ రావు తెలిపారు. ఆ పార్టీకి 48 శాతం ఓట్లు రావొచ్చని పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ 40 శాతం ఓట్లతో 40-45 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పారు. జనసేన ఒక్క స్థానానికే పరిమితమవుతుందని, ఆ పార్టీకి 8 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలిందన్నారు.